Monday, 26 April 2021

ఒరులేయని యొనరించిన - పద్యం

 

ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

భావము : ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు. 
               అదే ధర్మం.

Wednesday, 20 January 2021

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

 

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ||

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |

యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ||

ఈ శ్లోకాలు చదివిన, మనకు మానసిక ఆనందం, ఆరోగ్యం గ్రహబాధ నివారణకి ఈ పారాయణ వల్ల విముక్తి లభిస్తుంది….



తాత్పర్యము:

పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి, స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల, అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి. ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ! కమలనాభ!సురేశ! విష్ణో! వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా! జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి
లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.