Thursday 20 August 2020

తపస్సు - రచన

 మనసును, ఇంద్రియాలను ఏకాగ్రంగా ఉంచి చిత్తశుద్ధితో, నిష్ఠతో ఓ నామస్మరణో, మంత్రమో జపిస్తూ చేసే ధ్యానమే తపస్సు. అనంతమైన ఆలోచనా ప్రవాహానికి ఏకాగ్రతతో ఆనకట్టవేస్తూ మనసును ఒకే ఆలోచనమీద నిలిపేందుకే ఈ సాధన. లోకకల్యాణానికో, దివ్యశక్తులు పొందాలన్న కోరికతోనో, ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకునేందుకో, సత్యశోధనకో... ఇలా రకరకాల ధ్యేయాలతో తపస్సు చేస్తుంటారు.

ఈ జగత్తు దృశ్యమయం. కొన్ని మనసును పరవశింపజేేసేవి. మరికొన్ని అతలాకుతలం చేసేవి. ‘ఔరా’ అనే విధంగా సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసే సంఘటనలు ఇంకొన్ని. వీటిని అందరూ చూస్తూ భావోద్వేగాలకు గురైనా, కొందరు మాత్రమే వాటికి అక్షర రూపాన్నిస్తారు. అదే రచన. ఏకాగ్రత, మనోనిగ్రహం, చిత్తశుద్ధి తపస్సుకెంత ఆవశ్యకమో- రచనకూ అంతే. ఆ దృష్టితో చూసినపుడు తపస్సు, రచన రెండూ ఉత్కృష్టమైనవే, ఉదాత్తమైనవే.

మనసు కంటే చంచలమైనది ఏదీ ఉండదు. ఇటువంటి మనసులో ఒకే ఆలోచనను, లేదా విషయాన్ని నిలుపుకొని ధ్యానించడమే తపస్సు. రచనలోనూ అదే జరుగుతుంది. తన కళ్లు చూసిన అనేకానేక దృశ్య, ఘటనల సమాహారంనుంచి తనను ప్రభావితం చేసినవాటికి అక్షరరూపాన్నిచ్చే యత్నం చేస్తాడు రచయిత. దృష్టి సారించవలసిన అంశం నుంచి తాపసిని, రచయితను అనేక ఇతర విషయాలు మళ్ళించజూస్తాయి. అప్పుడే వాటిని ఆపగలగాలి. అలా సాధ్యం కాకపోతే వాటి ప్రభావం తాము దృష్టి పెట్టవలసిన ఆలోచనమీద పడకుండా చూసుకోవాలి. క్రమక్రమంగా మనసుకు ఓ కుదురు ఏర్పడుతుంది.

రచయితకు తాను సృజించదలుచుకున్న అంశం మీద స్పష్టత రావాలి. తాను చెప్పదలచుకున్న విషయం మీద ఓ పట్టును సాధించాలి. ఎడతెగని ఆలోచనా తరంగాలను దాటి తనకు కావలసిన ఆలోచనా పథంలో పయనించడాన్ని రచయిత అలవరచుకోవాలి. ఎంతో సాధన చేయాలి. తాపసికీ ఇదే వర్తిస్తుంది.

తపస్సంటే ఒకరకంగా మన ఆలోచనాశక్తినంతా ఒక అంశం మీద కేంద్రీకరించటం. దానిగురించి లోతుగా, విస్తృతంగా ఆలోచించటం. మనం దృష్టి నిలిపిన అంశం లోతుపాతులను, దాన్ని అన్ని పార్శ్వాలను దర్శించడం.

తపస్సుకైనా, రచనకైనా మనోనిశ్చలత కావాలి. దీనివల్ల ఓ ప్రశాంతస్థితి వస్తుంది. మనసొక నిర్మల తటాకమవుతుంది. అస్పష్టతనే సుడిగాలి నుంచి బయటపడిన తన అద్భుత భావదొంతరను సముచితమైన పదాలతో, పదబంధాలతో వ్యక్తీకరిస్తాడు.

మనసు, బుద్ధి అనే జోడు గుర్రాలమీద స్వారీ చేస్తూ, వాటిని స్వాధీనంలో ఉంచుకోవడం తాపసికి అవసరం. అంతటి నిశ్చల స్థితిని, ఆనంద స్థాయిని రచయితా పొందాలి.

రామాయణ, మహాభారతాలను రచించిన వాల్మీకి, వేదవ్యాసుడు తపోధనులు. పవిత్ర భావనతో ధర్మచింతనతో, ఆ రచనలను మహాకావ్యాలుగా తీర్చిదిద్ది లోకానికి అందించారు. అవి జాతి జీవనానికి మార్గ నిర్దేశకంగా నిలిచాయి.

ఏకాగ్రత, మనోనిశ్చలత, దార్శినిక దృష్టి- అయాచితంగా రావు. నిరంతర సాధనతో, తపనతో, అకుంఠిత దీక్షతో సాధించుకోవాలి.

No comments:

Post a Comment