Friday, 20 October 2023

ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్‌ ప్రారంభం

 తెలుగునాట మరో కొత్త ఆధ్యాత్మిక ఛానల్‌ ఆవిర్భవించింది. ఈటీవీ నెట్‌వర్క్‌లో ఇన్నాళ్లూ ఆరోగ్య సంజీవనిగా కొనసాగిన ఈటీవీ లైఫ్‌ ఛానల్‌ శుక్రవారం నుంచి ఆధ్యాత్మిక ఛానల్‌గా మార్పుచెందింది. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చిన విశేషాదరణ దృష్ట్యా ఈ మార్పు చేస్తున్నట్లు ఈటీవీ తెలిపింది. వీక్షకుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి, ఆధ్యాత్మికత వైపు నడిపించేలా చేయడమే ధ్యేయమని పేర్కొంది. దశాబ్దాలుగా తమ సంస్థకు గుండెల్లో కొండంత పీఠం వేసిన వీక్షక దేవుళ్లకు విజయదశమి కానుకగా ఈ ఛానల్‌ను ప్రారంభించామని, ఇందులో ఆధ్యాత్మిక సుసంపన్నతకు పెద్దపీట వేస్తామని తెలిపింది. ఉగాది మొదలు శివరాత్రి వరకు పండుగలు, పుణ్యతిథులు, బ్రహ్మోత్సవాలు, ప్రఖ్యాత ఆలయాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో జ్ఞానబోధ కోసం కృషి చేస్తామని ఈటీవీ పేర్కొంది.