Wednesday, 2 August 2017

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి
 శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాధుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు వున్నాయి. అహ్మద్‌నగర్‌ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదాలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో వుండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి.. 
 షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా వుండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్‌... తదితరులు ఆయన శిష్యగణంలో వుండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: 
బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిరప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్‌, లెండి గార్డెన్స్‌... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్మాత్మిక భావం అలముకుంటుంది. సాయి సంస్థాన్‌ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
వసతి సౌకర్యం 
 * సంస్థాన్‌ వారు అనేక వసతి సముదాయాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చు, * ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా వున్నాయి. భక్తులు వారి ఆర్థిక స్థోమతకు తగినట్టుగా గదులను తీసుకోవచ్చు. ఎలా చేరుకోవచ్చు * దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది. * హైదరాబాద్‌ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు వున్నాయి. * అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేవారు దిగివలసిన స్టేషన్‌ నాగర్‌సోల్‌. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు వుంటాయి. * సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు. * షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. * ఔరంగాబాద్‌ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.