Thursday 20 August 2020

భాద్రపద మాసం

 హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఏదో ఒక విశేషం ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైంది భాద్రపదం. దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపదం (20 ఆగస్టు నుంచి—17-సెప్టెంబర్) అనే పేరువచ్చింది. తొలిపూజలందుకునే వినాయకుడు పుట్టిందీ, స్థితికారకుడైన శ్రీహరి భక్తులను రక్షించడానికి వరాహ, వామనావతారాలు ధరించిందీ ఈ మాసంలోనే. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ వినాయక చవితి. ఊరూవాడా చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుడిని శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం. శుద్ధ తదియనాటి వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయమైపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావాల్సిందిగా బ్రహ్మను ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే బ్రహ్మ తుమ్మగా ఆ తుమ్ము నుంచి యజ్ఞవరాహమూర్తి పుడతాడు. యజ్ఞవరాహం అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీరభాగాలుగా కలిగినవాడని అర్థం.
ఈ మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలున్నాయి. మొదటగా శుక్ల పక్షంలో దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యత ఇస్తే, రెండోదైన కృష్ణపక్షంలో పితృదేవతలకు అనుకూలమైన మాసంగా పరిగణిస్తారు.
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి పది అవతారాలు ఎత్తాడనే విషయం చాలా మందికి తెలుసు. అయితే అందులోని వరహా, వామన అవతారానికి ఈ మాసంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు పండితులు.
బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామి క్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది.
అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయంటారు. భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజిస్తే విద్యాబుద్ధులతోపాటు సకల సంపదలూ లభిస్తాయి.
మర్నాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తరుషులతోపాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.ఆ తర్వాతి రోజు షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి, సూర్యషష్ఠి అని కూడా అంటారు.
నిజానికి మాఘమాసంలో మాదిరిగానే భాద్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలూ సూర్యభగవానుడిని అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషతల్పంమీద శయనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే కరవుకాటకాలు దరిచేరవట.
భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.
బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు. అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి. సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగా సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి, చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుందట. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి శివుడి శరీరంలోని అర్ధభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.
శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.
ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.
తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.
పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.
భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగ్గవే!
ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
భాద్రపద మాసంలో పండుగలు
శుక్ల చవితి : వినాయక చవితి
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

No comments:

Post a Comment